Monday, 31 August 2015

రాష్ట్రంలో 34 పట్టణాల్లో ఆవాస్ యోజన

రాష్ట్రంలో 34 పట్టణాల్లో ఆవాస్ యోజన





న్యూఢిల్లీ, నమస్తే తెలంగాణ:దేశంలోని పట్టణప్రాంతాల్లో ప్రతి కుటుంబానికీ సొంత ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అందరికీ ఇండ్లు) పథకానికి తొలి దశలో తెలంగాణ సహా 9 రాష్ర్టాలను ఎంపికచేశారు. ఈ రాష్ర్టాల్లోని 305 నగరాలు, పట్టణాల్లో ఇండ్లు లేని నిరుపేదలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇస్తారు. మన రాష్ట్రంలోని 34 నగరాలు, పట్టణాల్లో పేదలకు ఇండ్లు కట్టివ్వనున్నారు. కేంద్ర, రాష్ట్రాలు సంయుక్తంగా అమలుచేసే ఈ పథకానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు గృహనిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన (హెచ్‌యూపీఏ) శాఖ అధికారులు ఆదివారం ప్రకటించారు. పథకం కింద కేంద్రం ఒక్కో ఇంటికి రూ.1లక్ష నుంచి రూ.2.30 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేస్తుంది. తెలంగాణలో ఇండ్లు లేని నిరుపేదలకు రెండు పడక గదుల ఇండ్లను నిర్మించడానికి సీఎం కేసీఆర్ ఇప్పటికే కసరత్తుప్రారంభించిన నేపథ్యంలో కేంద్ర పథకం కూడా రాష్ట్ర పథకంతో కలిసి అమలు కానుంది. రాష్ట్రం నుంచి ఇప్పటికే రెండు స్మార్ట్ సిటీలు, 11 అమృత్ నగరాలుగా ఎంపికైన విషయం తెలిసిందే. అందరికీ ఇండ్లు పథకం కూడా వీటితో పాటే అమలు కానుంది. హైదరాబాద్, వరంగల్ నగరాల్లో ఏకకాలంలో స్మార్ట్ సిటీ, అమృత్, అందరికీ ఇండ్లు పథకాలు అమలవుతాయి. మిగిలిన ఎనిమిది అమృత్ నగరాల్లో ఆ పథకంతోపాటు అందరికీ ఇండ్లు పథకం అమలవుతుంది. సిద్దిపేట విషయంలో కేంద్రం నుంచి ఇంకా అమృత్ ప్రకటన అధికారికంగా వెలువడనందున ప్రస్తుతానికి రాష్ట్రంలో పది అమృత్ నగరాలు మాత్రమే మంజూరైనట్లు భావించాల్సి ఉంటుంది. హైదరాబాద్, వరంగల్‌లతోపాటు ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మిర్యాలగూడ, నల్లగొండ, మహబూబాబాద్, నిజామాబాద్, సూర్యాపేటలు అమృత్ నగరాలుగా ఎంపికయ్యాయి. 

కేంద్రంతో 15 రాష్ర్టాల ఒప్పందం


అందరికీ ఇండ్ల పథకాన్ని అమలుచేసేందుకు కేంద్రంతో 15 రాష్ర్టాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కేంద్రం ప్రతిపాదించిన ఆరు సంస్కరణలను అమలుచేసేందుకు ఈ రాష్ర్టాలు అంగీకరించాయి. వీటిలో మొదటగా 9 రాష్ర్టాల్లో పథకం అమలుకోసం పట్టణాలు, నగరాలను ఎంపికచేశారు. తెలంగాణ (34), ఒడిషా (42), రాజస్థాన్ (40), మధ్యప్రదేశ్ (74), కేరళ (15), జార్ఖండ్ (15), జమ్ముకశ్మీర్ (19), గుజరాత్ (30), ఛత్తీస్‌గఢ్ (36)లో మొదటిదశలో ఇండ్లు నిర్మిస్తారు. కేంద్రంతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్న మిగతా రాష్ర్టాల్లో ఆంధ్రప్రదేశ్, బీహార్, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, ఉత్తరాఖండ్ ఉన్నాయి. 

modin



ఆరేండ్లలో రూ.2 లక్షల కోట్లతో రెండు కోట్ల ఇండ్లు


దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2022వ సంవత్సరం నాటికి 75 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో అప్పటికల్లా దేశంలోని పట్టణ పేదలకు రెండు కోట్ల ఇండ్లను నిర్మించి ఇవ్వాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ నిర్ణయించింది. ఇందుకోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చుచేయనున్నారు. అయితే, కేంద్రం నిర్దేశించిన ఆరు సంస్కరణలను అమలుచేస్తేనే ఇండ్ల నిర్మాణానికి నిధులు ఇస్తుంది. పథకం కింద ఎంపికైన పట్టణాల్లో నివాస ప్రాంతాలకు మాస్టర్ ప్లాన్ రూపొందించేటప్పుడు ఏ విధమైన సాగుభూములు లేకపోతే వెంటనే అమలు చేయడం, పథకం అమలుకు స్పష్టమైన ప్రణాళికను రూపొందించడం, ఇండ్ల నిర్మాణానికి అన్ని రకాల అనుమతులను సింగిల్ విండో విధానంతో సత్వరం మంజూరు చేయడం, ఆర్థికంగా బలహీనవర్గాలు, తక్కువ ఆదాయ వర్గాలకు ఇండ్లను నిర్మించడంలో అనుమతులకు ప్రాధాన్యం ఇవ్వడం, అవసరమైతే అద్దె చట్టాలకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఇప్పటికే సూచించిన విధంగా సవరణలు చేయడం, మురికివాడల అభివృద్ధి, తక్కువ ఖర్చుతో నిర్మించే ఇండ్ల విషయంలో అవసరాన్ని బట్టి నిర్మాణ విస్తీర్ణాన్ని పెంచడం అనే నిబంధనలను కేంద్రం విధించింది.

తెలంగాణలో పథకం అమలయ్యే పట్టణాలు:


ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, కరీంనగర్, జమ్మికుంట, మెట్‌పల్లి, హుజూరాబాద్, హుస్నాబాద్, సిరిసిల్ల, వరంగల్, మహబూబాబాద్, జనగాం, ఖమ్మం, పాల్వంచ, నల్లగొండ, భువనగిరి, మిర్యాలగూడ, సూర్యాపేట, మెదక్, జహీరాబాద్, సిద్దిపేట, వికారాబాద్, దుబ్బాక, గజ్వేల్, సంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, షాద్‌నగర్, అచ్చంపేట, కొల్లాపూర్.


AUTHOR :- BELLAPURI SAIKUMAR

No comments:

Post a Comment