Monday, 31 August 2015

పాలమూరులో మెడికల్ కాలేజీ

పాలమూరులో మెడికల్ కాలేజీ




హైదరాబాద్, నమస్తే తెలంగాణ : మహబూబ్‌నగర్‌లో కొత్తగా మెడికల్ కాలేజీ ఏర్పాటు కానుంది. ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత నిరాదరణకు గురై, వెనుకబడిన పాలమూరు జిల్లాను అభివృద్ధి బాటలో నడిపేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీసుకుంటున్న పలుచర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లా వెనుకబాటుతనంతోపాటు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం వైద్యకళాశాల ఏర్పాటుకు సుముఖత వ్యక్తంచేసింది.

మహబూబ్‌నగర్ జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను ఆదివారం డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) అధికారులు ఆన్‌లైన్‌లో సాఫ్ట్‌కాపీని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)కి పంపించారు. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సంబంధించి ఆగస్టు 31 చివరితేదీ కావడంతో డీఎంఈ అధికారులు సోమవారం ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు మెడికల్ కాలేజీలున్నాయి. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఉండాలనే తలంపుతో ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు సిద్ధమైంది. నల్లగొండ, కరీంనగర్, మెదక్, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ప్రభుత్వ కాలేజీలు లేవు. మొత్తానికి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లకా్ష్మరెడ్డి కృషి త్వరలో ఫలించనుంది.

అన్ని అనుమతులతో పకడ్బందీగా: మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఏర్పాటుచేసే మెడికల్ కాలేజీకి సంబంధించి అన్ని అనుమతులను ఇప్పటికే పొందారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ స్థలం కేటాయించాలి. ఈ మేరకు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ 23 ఎకరాలను కేటాయిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశారు. అదే సమయంలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. దీంతో బ్లడ్‌బ్యాంక్ ఏర్పాటుకు డ్రగ్‌కంట్రోల్ అథారిటీ సర్టిఫికెట్లు కూడా వెంటనే వచ్చాయి. వీటితో పాటు ఇతర అన్ని సర్టిపికెట్ల సాఫ్ట్‌కాపీలను ఆన్‌లైన్‌లో ఎంసీఐకి పంపారు.

హార్డ్‌కాపీలను సోమవారం అందించనున్నారు. ఎంతో వెనుకబాటుకు గురైన మహబూబ్‌నగర్ జిల్లాలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో జిల్లాకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా దవాఖానలో 350 పడకల సామర్థ్యం ఉంది. మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ఈ సామర్థ్యం సరిపోతుంది. కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనుమతి లభిస్తే ఈ దవాఖాన సామర్థ్యం వెయ్యిపడకలకు పెరుగుతుంది. అదే సమయంలో స్పెషాలిటీ సేవలు, పీజీ సీట్లు కూడా అందుబాటులోకి వస్తాయి. 2016-17 సంవత్సరంలో ఈ కాలేజీని ప్రారంభించాలనే లక్ష్యంతో అధికారులు పరుగులు పెడుతున్న నేపథ్యంలోనే త్వరలోనే ఎంసీఐ నుంచి తనిఖీ బృందం వచ్చి పరిశీలించనుంది.

No comments:

Post a Comment